ఉరవకొండ రూరల్ (aptoday) : పట్టణంలోని డ్రైవర్ కాలనీ, ఎస్‌ఎల్‌ఎన్ కాలనీ, చౌడేశ్వరి కాలనీ, ప్రాంతాల్లో పందుల స్వైరవిహారం రోజురోజుకూ పెరుగుతుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్ల పక్కన, మురుగు కాలువల వద్ద, ఖాళీ స్థలాల్లో పేరుకుపోయిన చెత్తకుప్పల్లో పందులు గుంపులుగా సంచరిస్తూ దుర్వాసన వెదజల్లుతున్నాయి. దీంతో కాలనీవాసులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
ఉదయం, సాయంత్రం వేళల్లో పందులు ప్రధాన రహదారులపైకి రావడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు పాఠశాలలకు వెళ్లే సమయంలో, మహిళలు, వృద్ధులు రాకపోకలు సాగించే వేళ భయాందోళనకు గురవుతున్నారని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికే పలుచోట్ల పందులు వాహనాలకు అడ్డుగా రావడంతో ప్రమాదాలు తృటిలో తప్పిన ఘటనలు చోటుచేసుకున్నాయని చెబుతున్నారు.
కాలనీల్లో చెత్తను సకాలంలో తొలగించకపోవడం, మురుగు కాలువల నిర్వహణ సరిగా లేకపోవడంతో పందుల సంఖ్య పెరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దోమలు, ఈగలు అధికమై డెంగీ, చికున్‌గున్యా, వైరల్ జ్వరాలు వంటి అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సమస్యపై పలుమార్లు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా శాశ్వత పరిష్కారం చూపలేదని స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రత్యేక చర్యలు చేపట్టి పందుల సంచారాన్ని అరికట్టడంతో పాటు చెత్తను ఎప్పటికప్పుడు తొలగించి పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని డ్రైవర్ కాలనీ, ఎస్‌ఎల్‌ఎన్ కాలనీ, చౌడేశ్వరి కాలనీ, ఇందిరానగర్ వాసులు మున్సిపల్ అధికారులను కోరుతున్నారు.