అమరావతి : బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల వద్ద అల్పపీడనం కేంద్రీకృతమవ్వడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. మరోవైపు తీరం వెంబడి గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత సూచించారు.
వర్షాల ప్రభావంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. వర్ష ప్రభావిత జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లను తక్షణమే ఏర్పాటు చేయాలని సూచించారు. అల్పపీడనం కదలికలు, వాతావరణ పరిస్థితులపై ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు.
అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సహాయం అందించేందుకు విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ టోల్‌ఫ్రీ నంబర్లు 112, 1070, 1800 425 0101 అందుబాటులో ఉంచినట్లు మంత్రి అనిత తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు పాటించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.