కదిరి, సెప్టెంబర్ 4 (APTODAY): కదిరి పట్టణంలో నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, రౌడీషీటర్ల కట్టడి, రాత్రి పహారా, డ్రంకెన్ డ్రైవింగ్ నియంత్రణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, డీఎస్పీ శివన్నారాయణ స్వామి పర్యవేక్షణలో కదిరి టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ బి. వెంకటేశ్వర్లు జూలై 15న బాధ్యతలు స్వీకరించిన అనంతరం పట్టణంలో నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులు, రౌడీషీటర్లు, హిస్టరీషీటర్లు, తరచూ గొడవలకు పాల్పడే వ్యక్తులపై BNSS సెక్షన్లు 126, 129 ప్రకారం ముందస్తు చర్యలు చేపట్టారు. జూలై, ఆగస్టు నెలల్లో 11 కేసులకు సంబంధించి 38 మంది నుంచి పూచీకత్తులు తీసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన ఐదుగురికి పూచీకత్తు ఫోర్‌ఫీచర్ నోటీసులు జారీ చేయగా, పూచీకత్తు షరతులను ఉల్లంఘించిన ఒక వ్యక్తిని జ్యుడిషియల్ రిమాండ్‌కు పంపించారు. సంబంధిత వ్యక్తులపై ఏడాది కాలానికి రూ.5 లక్షల పూచీకత్తు షరతులు విధించారు. పలు శారీరక నేరాల్లో ప్రమేయం ఉన్న రౌడీషీటర్ నెం.349 షేక్ ముజాహిద్ @ ముజ్జు (20)పై పీడీ యాక్ట్ అమలు చేసినట్లు పోలీసులు తెలిపారు. నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తుల కదలికలపై నిరంతర నిఘా కొనసాగుతోంది. దొంగతనాలు, రాత్రివేళ జరిగే ఇతర నేరాలను అరికట్టేందుకు ఇప్పటికే ఉన్న రెండు రెగ్యులర్ నైట్ బీట్‌లకు అదనంగా 1+1 మఫ్టీ/లర్కింగ్ నైట్ బీట్‌లను ఏర్పాటు చేశారు. ప్రధాన కూడళ్లు, నేరాలకు అవకాశం ఉన్న ప్రాంతాలు, అనుమానాస్పద ప్రదేశాల్లో ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు. ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు వార్డుల వారీగా మహిళలు, బాలల భద్రత, మాదకద్రవ్యాల దుర్వినియోగం నివారణ, వినాయక చవితి ఉత్సవాల్లో శాంతిభద్రతలు, ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రత, నేరాల నివారణలో ప్రజల భాగస్వామ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా మోటారు వాహనాల చట్టం సెక్షన్ 185 కింద డ్రంకెన్ డ్రైవింగ్‌పై విస్తృత తనిఖీలు చేపట్టారు.

జూలైలో 22, ఆగస్టులో 46 కలిపి మొత్తం 68 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేసి రూ.4,09,000 జరిమానా వసూలు చేశారు. డ్రంకెన్ డ్రైవింగ్‌కు పాల్పడిన ఏడుగురిని జైలుకు పంపించారు. హెల్మెట్ లేకుండా వాహనం నడపడం, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం, ట్రిపుల్ రైడింగ్, పర్మిట్ లేకుండా వాహనాలు నడపడం, బీమా లేకపోవడం, ఓవర్‌లోడింగ్ తదితర ట్రాఫిక్ ఉల్లంఘనలపై 414 కేసులు నమోదు చేసి రూ.1,34,740 జరిమానా వసూలు చేశారు. జూలై 15 నుంచి ఆగస్టు 31 వరకు కదిరి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం 482 ట్రాఫిక్ కేసులు నమోదు కాగా, మొత్తం రూ.5,43,740 జరిమానా వసూలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కదిరి పట్టణంలో నేరాలను అరికట్టడం, ప్రజలకు సురక్షిత వాతావరణం కల్పించడం, శాంతిభద్రతలను కాపాడటమే పోలీసుల ప్రధాన లక్ష్యమని డీఎస్పీ శివన్నారాయణ స్వామి, సీఐ బి. వెంకటేశ్వర్లు తెలిపారు. నేర నియంత్రణ, రోడ్డు భద్రత, ప్రజా భద్రతకు సంబంధించి చేపడుతున్న చర్యలు ఇకముందు కూడా నిరంతరాయంగా కొనసాగుతాయని వారు పేర్కొన్నారు.