హైదరాబాద్: టాలీవుడ్‌లో మరో సెలబ్రిటీ జంట త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతోంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి కుమారుడు, నటి కావ్య కళ్యాణ్‌రామ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
ఈ విషయాన్ని ఇద్దరూ తమ ఇన్‌స్టాగ్రామ్ పోస్టుల ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఒకరితో ఒకరు గడిపే సమయాన్ని ప్రకృతితో ముడిపెడుతూ తమ ప్రేమను కవితాత్మకంగా వ్యక్తం చేశారు.
“నీతో సమయం గడపడం అంటే కొండల ఒడ్డున కూర్చొని సెలయేటిని చూస్తున్నట్లుగా ఉంటుంది. నీతో మాట్లాడటం అంటే చలికాలపు పొద్దున్నే ఇష్టమైన కాఫీ తాగుతున్నట్లుగా ఉంటుంది” అంటూ తమ అనుబంధాన్ని అందంగా వివరించారు.
అంతేకాకుండా.. “ఇప్పుడు మనమిద్దరం జీవితాంతం ఒకే ఇంట్లో ఉంటామనే విషయాన్ని అందరికీ చెప్పడం సంతోషంగా ఉంది” అంటూ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్న విషయాన్ని వెల్లడించారు.
ఈ ప్రకటనతో అభిమానులు, సినీ ప్రముఖులు ఈ జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.