హైదరాబాద్‌లోని మీరాలం చెరువు వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఉదయం ఆకస్మికంగా పరిశీలించారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణ పనుల పురోగతిని ఆయన క్షేత్రస్థాయిలో సమీక్షించారు.
పనుల తీరును మరింత దగ్గరగా పరిశీలించేందుకు ముఖ్యమంత్రి భారీ క్రేన్‌పైకి ఎక్కి నిర్మాణ పనులను పర్యవేక్షించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడిన సీఎం, నిర్దేశిత గడువులోగా అన్ని పనులను పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
మీరాలం చెరువులోకి ఎలాంటి పరిస్థితుల్లోనూ మురుగునీరు చేరకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే మీరాలం నుంచి మూసీ నదిలోకి వరద నీరు సులభంగా వెళ్లేలా నాలాను విస్తరించాలని సూచించారు.
చెరువులో ఉన్న ఐల్యాండ్‌ను ప్రత్యేకంగా అభివృద్ధి చేయడంతో పాటు, పర్యాటకులను ఆకర్షించేలా వాటర్ స్పోర్ట్స్ నిర్వహణకు అనువైన డిజైన్‌ను రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. మీరాలం చెరువును భవిష్యత్తులో హైదరాబాద్‌లోని ప్రధాన పర్యాటక ఆకర్షణ కేంద్రంగా తీర్చిదిద్దాలని ఆయన దిశానిర్దేశం చేశారు.