ఒంటిమిది గ్రామంలో అమిలినేని విద్యాచక్రం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే గ్రామానికి చేరుకోగానే గ్రామస్థులు, నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాఠశాల అంటే దేవాలయంతో సమానమని, విద్యార్థులకు విద్యను అందించే పవిత్రమైన ప్రాంగణంలో అసాంఘిక కార్యకలాపాలకు ఎలాంటి తావు ఉండకూడదని అన్నారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే స్వయంగా చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న సౌకర్యాలు, విద్యా అవకాశాలను గమనించి తమ పిల్లలను చేర్పించాలని కోరారు.
విద్యార్థులు పాఠశాలకు సులభంగా వెళ్లేందుకు సైకిళ్ల పంపిణీ చేపట్టడం అభినందనీయమని గ్రామస్థులు పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు అండగా నిలుస్తున్న ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.