ప్రధాని నరేంద్ర మోదీ ఉజ్బెకిస్థాన్ పర్యటన ఉత్సాంహంగా సాగుతోంది. నాలుగు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా మోదీ దిల్లీ నుంచి బయలుదేరి ఉజ్బెకిస్థాన్ రాజధాని తాష్కెంట్ చేరుకోగా, అక్కడ విమానాశ్రయంలో ఆ దేశ అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయెవ్ ఘన స్వాగతం పలికారు. పెట్టుబడులు, వాణిజ్యం తదితర అంశాల్లో సహకారంపై ఇరుదేశాదినేతలు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ భారత్-ఉజ్బెకిస్థాన్ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతమవడంతో పాటు దినదినాభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. ఉజ్బెకిస్థాన్‌లోని అధికారిక కార్యక్రమాల అనంతరం మోదీ కిర్గిజిస్థాన్ చేరుకుంటారు. బిష్కెక్ నగరంలో నిర్వహించనున్న షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. భారత ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో తాష్కెంట్ నగరం త్రివర్ణ శోభితంగా మారింది. అక్కడి ఓ భవనంపై ప్రదర్శించిన భారత జాతీయ పతాకం విషేషంగా ఆకట్టుకుంటోంది. మరోవైపు ప్రవాస భారతీయులను మోదీ ఆత్మీయంగా పలకరించారు. వారితో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నారు.