బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణ బకాయిల వ్యవహారంలో పరారీలో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా మరోసారి తనకు న్యాయం జరగడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తనపై ఉన్న అసలు అప్పు కంటే బ్యాంకులు, ప్రభుత్వం ఎక్కువ మొత్తాన్ని రికవరీ చేశాయని ఆయన ఆరోపించారు.
సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో విజయ్ మాల్యా చేసిన తాజా పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. మీడియా అధినేత సుభాష్ చంద్రకు సంబంధించిన రుణ పరిష్కార వార్తను ప్రస్తావిస్తూ, భారతదేశంలో రుణ పరిష్కార వ్యవస్థపై ఆయన ప్రశ్నలు సంధించారు.
ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (IBC) కింద సుభాష్ చంద్ర రూ.6.5 కోట్లు చెల్లించి, రూ.22,006 కోట్ల రుణ క్లెయిమ్‌లను సెటిల్ చేసుకోబోతున్నారంటూ వచ్చిన మీడియా కథనాన్ని మాల్యా ప్రస్తావించారు. ఇది నిజమైతే సుభాష్ చంద్రకు అభినందనలు అని పేర్కొంటూ, తన నుంచి మాత్రం రూ.6,203 కోట్ల అప్పునకు గాను రూ.14,100 కోట్లు రికవరీ చేసినట్లు ప్రభుత్వం, బ్యాంకులు అంగీకరించాయని ఆయన వ్యాఖ్యానించారు.
“ఇదే భారత రుణ పరిష్కార న్యాయమా?” అంటూ మాల్యా ప్రశ్నించారు. తన కేసులో జరిగిన రికవరీపై మీడియా ఎందుకు ప్రశ్నించడం లేదని కూడా నిలదీశారు.
గత ఏడాది డిసెంబర్‌లోనూ మాల్యా ఇదే అంశంపై ఆరోపణలు చేశారు. తన నుంచి రికవరీ చేసిన మొత్తానికి సంబంధించి ప్రభుత్వం, బ్యాంకులు వెల్లడిస్తున్న లెక్కల్లో వ్యత్యాసం ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం పార్లమెంటులో రూ.14,100 కోట్లు రికవరీ చేసినట్లు చెప్పగా, బ్యాంకులు మాత్రం రూ.10,000 కోట్లు మాత్రమే వసూలు చేసినట్లు చెబుతున్నాయని ఆయన ప్రశ్నించారు.
రికవరీ లెక్కలపై స్పష్టత కోసం ఒక రిటైర్డ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని కూడా మాల్యా గతంలో డిమాండ్ చేశారు.
మరోవైపు ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2025 అక్టోబర్ 31 నాటికి దేశంలో 15 మందిని పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్లుగా ప్రకటించారు. వీరి కారణంగా బ్యాంకులకు భారీ నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే మాల్యా నుంచి రుణాలపై గణనీయమైన మొత్తం రికవరీ అయినప్పటికీ, వడ్డీ, జరిమానాలు, అలాగే ఆయనపై ఉన్న క్రిమినల్ కేసులు యథావిధిగా కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు.