దేశవ్యాప్తంగా బ్యాంకు ఖాతాదారులకు ముఖ్యమైన సమాచారం. సెప్టెంబర్ 11, 2026 నుంచి కొన్ని ప్రాంతాల్లో వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకు బ్రాంచ్ సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) సెప్టెంబర్ 11న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడంతో పాటు.. ఆ తర్వాత రెండో శనివారం, ఆదివారం సెలవులు ఉన్నాయి. సెప్టెంబర్ 14న ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో వినాయక చవితి సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉంది.
సెప్టెంబర్ 11న బ్యాంకు సమ్మె
ఐదు రోజుల పనిదినాల విధానం అమలు చేయాలని, పనితీరు ఆధారిత ప్రోత్సాహకాల (PLI) విధానాన్ని సమీక్షించాలని, పెన్షన్‌కు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని బ్యాంకు ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ అంశాలపై UFBU, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) మధ్య చర్చలు జరిగినప్పటికీ స్పష్టమైన పరిష్కారం రాకపోవడంతో సెప్టెంబర్ 11 సమ్మె కొనసాగించాలని యూనియన్లు నిర్ణయించాయి.
నాలుగు రోజుల వరుస విరామం ఎలా?
- సెప్టెంబర్ 11, శుక్రవారం: UFBU పిలుపుతో బ్యాంకు సమ్మె
- సెప్టెంబర్ 12, శనివారం: రెండో శనివారం సెలవు
- సెప్టెంబర్ 13, ఆదివారం: వారాంతపు సెలవు
- సెప్టెంబర్ 14, సోమవారం: వినాయక చవితి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో బ్యాంకు సెలవు
అయితే సెప్టెంబర్ 14 సెలవు దేశంలోని అన్ని బ్యాంకులకు ఒకే విధంగా వర్తించదు. RBI బ్యాంకు హాలిడే క్యాలెండర్ ప్రకారం విజయవాడ, హైదరాబాద్‌తో పాటు పలు బ్యాంకింగ్ కేంద్రాల్లో ఆ రోజు సెలవు ఉంది.
ఏ సేవలకు ఇబ్బంది ఉండొచ్చు?
సమ్మె సమయంలో ముఖ్యంగా బ్యాంకు బ్రాంచ్‌లలో జరిగే క్యాష్ డిపాజిట్లు, నగదు విత్‌డ్రాలు, చెక్ క్లియరెన్స్, రుణ ప్రక్రియలు, KYC తదితర సేవలు ఆలస్యం కావచ్చు. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులపై ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని సమాచారం.
డిజిటల్ సేవలు కొనసాగుతాయా?
బ్యాంకు బ్రాంచ్‌లు మూసి ఉన్నప్పటికీ UPI, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ATMలు సాధారణంగా అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అయితే సెలవులు, సమ్మె వరుసగా ఉండటంతో కొన్ని చోట్ల ATMల్లో నగదు అందుబాటులో లేకపోవడం లేదా కొన్ని సేవల్లో ఆలస్యం ఏర్పడే అవకాశం ఉంది.
ఖాతాదారులు ఏం చేయాలి?
బ్యాంకులో ప్రత్యక్షంగా చేయాల్సిన ముఖ్యమైన పనులు ఉంటే సెప్టెంబర్ 11కి ముందే పూర్తి చేసుకోవడం మంచిది. ముఖ్యంగా నగదు అవసరాలు, చెక్ క్లియరెన్స్, రుణ సంబంధిత పనులు, KYC లేదా ఇతర బ్రాంచ్ ఆధారిత సేవలను ముందుగానే పూర్తి చేసుకోవాలని ఖాతాదారులకు సూచన.
మరిన్ని సమ్మెలకు హెచ్చరిక
సెప్టెంబర్ 11 సమ్మెతో సమస్య పరిష్కారం కాకపోతే సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు మూడు రోజుల సమ్మె, అలాగే డిమాండ్లు నెరవేరని పక్షంలో అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు UFBU ప్రకటించింది.