పేదలందరికీ ఇళ్లు, ఇంటి స్థలాలు కేటాయించాలి: సీపీఎం డిమాండ్
నేటి నుంచి 15 వరకు సర్వేలు.. 16 నుంచి పాదయాత్రలు.. 21, 22న తహశీల్దార్ కార్యాలయాల వద్ద నిరసనలు
మీడియా సమావేశంలో సీపీఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం. జగ్గునాయుడు వెల్లడి
విశాఖపట్నం, సెప్టెంబర్ 10 (AP Today): ఇళ్లులేని పేదలకు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల ఇంటి స్థలం కేటాయించి, ఇళ్లు మంజూరు చేయాలని సీపీఎం విశాఖ జిల్లా కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. వివిధ గృహ పథకాల కింద మంజూరైన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి లబ్ధిదారులకు వెంటనే అప్పగించాలని సీపీఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం. జగ్గునాయుడు కోరారు.
టిడ్కోతో పాటు ఇతర గృహాల అప్పగింతలో ప్రభుత్వం మరింత జాప్యం ప్రదర్శిస్తే ప్రజలను సమీకరించి ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని ఆయన హెచ్చరించారు. గురువారం పిఠాపురం కాలనీలోని ఏచూరి భవన్‌లో ఉన్న సీపీఎం జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జగ్గునాయుడు మాట్లాడారు. ఈ సమావేశంలో పార్టీ కంచరపాలెం జోన్ కార్యదర్శి బొట్టా ఈశ్వరమ్మ, గోపాలపట్నం జోన్ కార్యదర్శి బి. జగన్, మద్దిలపాలెం జోన్ కార్యదర్శి వి. కృష్ణారావు పాల్గొన్నారు.
పేదల ఇళ్ల సమస్య పరిష్కారానికి దశలవారీ పోరాటం
సొంత ఇల్లు లేక, అధిక అద్దెలు చెల్లించలేక పేదలు, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జగ్గునాయుడు అన్నారు. పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే ఆలోచన ప్రభుత్వాలకు లేకపోవడం బాధాకరమన్నారు.
నిర్మాణాలు పూర్తయిన ఇళ్లకు మౌలిక సదుపాయాలు కల్పించాలని, అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. దశాబ్దాలుగా పేదలు నివసిస్తున్న స్థలాలను క్రమబద్ధీకరించాలని కోరారు.
పేదల ఇళ్ల సమస్యపై సీపీఎం దశలవారీగా పోరాటాలు చేపడుతుందని తెలిపారు. ఈ నెల 11 నుంచి 15 వరకు సర్వేలు, పర్యటనలు, 16 నుంచి 18 వరకు పాదయాత్రలు నిర్వహిస్తామని చెప్పారు. అనంతరం 21, 22 తేదీల్లో జిల్లాలోని తహశీల్దార్ కార్యాలయాల వద్ద సామూహిక ధర్నాలు చేపడతామని వెల్లడించారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
టిడ్కో లబ్ధిదారులకు ఇళ్ల కేటాయింపులో జాప్యంపై విమర్శలు
విశాఖలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 20,264 మంది టిడ్కో లబ్ధిదారులు ఉండగా, వారిలో 8,024 మందికి మాత్రమే ఇళ్లు కేటాయించారని జగ్గునాయుడు తెలిపారు. టిడ్కో ఇళ్ల కోసం అప్పులు చేసి డబ్బులు చెల్లించిన పేదలకు వడ్డీ భారం పెరుగుతోందని, కానీ ఇప్పటికీ ఇళ్లు స్వాధీనం కాలేదని ఆరోపించారు.
గత ప్రభుత్వం జగనన్న కాలనీల పేరుతో పేదలకు కేటాయించిన దాదాపు 1.10 లక్షల ఇళ్లలో కేవలం 29,456 నిర్మాణాలు మాత్రమే ప్రారంభ దశలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అసంపూర్తిగా ఉన్న ఇళ్లను పూర్తి చేసి పేదలకు అందించాలని డిమాండ్ చేశారు.
నగరానికి దూరంగా కాకుండా ఉపాధి ప్రాంతాల్లో ఇళ్లు ఇవ్వాలి
పేదలను నగరానికి 40 కిలోమీటర్ల దూరంలో కాకుండా, వారు ఉపాధి పొందుతున్న ప్రాంతాలకు సమీపంలోనే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని జగ్గునాయుడు కోరారు. నగరం మధ్యలో విలువైన భూములను ఇతర ప్రాజెక్టులకు కేటాయిస్తున్న ప్రభుత్వం, పనులు చేసుకొని జీవించే పేదలకు నగర శివార్లలో ఇళ్లు కేటాయిస్తే వారి జీవనోపాధి ఎలా సాగుతుందని ప్రశ్నించారు.
ఎన్నికల హామీ ప్రకారం పట్టణ పేదలకు రెండు సెంట్లు, గ్రామీణ పేదలకు మూడు సెంట్ల ఇంటి స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న పేదలకు యాజమాన్య హక్కులు ఇవ్వాలి
ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న పేదలకు వారి ఇంటి స్థలాలపై పూర్తి యాజమాన్య హక్కులు కల్పించాలని సీపీఎం డిమాండ్ చేసింది. జీఓ 296 ప్రకారం అర్హులైన పేదల స్థలాలను క్రమబద్ధీకరించాలని జగ్గునాయుడు కోరారు.
చెరువులు, గెడ్డల స్థలాల్లో నివాసాలు ఉన్నాయంటూ క్రమబద్ధీకరణకు అభ్యంతరాలు చెబుతున్న ప్రభుత్వం, అదే ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలకు ఎలా అనుమతులు ఇస్తోందని ప్రశ్నించారు. గాజువాక కుంచమాంబ కాలనీ, స్వతంత్రనగర్, మల్కాపురం గుల్లలపాలెం సహా పలు ప్రాంతాల్లోని పేదల ఇంటి స్థలాలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు.
పంచ గ్రామాల్లో కొనసాగుతున్న భూ సమస్యకు కూడా ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.
పేదలు, మధ్యతరగతి ప్రజలు నివసిస్తున్న స్థలాల క్రమబద్ధీకరణ విషయంలో ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోవాలని, ఇళ్లులేని పేదలకు వెంటనే ఇంటి స్థలాలు, ఇళ్లు మంజూరు చేయాలని జగ్గునాయుడు డిమాండ్ చేశారు. టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించడంలో ప్రభుత్వం మరింత తాత్సారం చేస్తే ప్రజా పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.