రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీజీఎస్‌ఆర్టీసీ ఆగస్టు 27 నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5,000 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. అయితే, ఈ ప్రత్యేక సర్వీసుల్లో సాధారణ ఛార్జీల కంటే అధికంగా టికెట్ ధరలు వసూలు చేయడంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఎంజీబీఎస్ నుంచి జడ్చర్లకు సాధారణ ఛార్జీ రూ.150 ఉండగా ప్రత్యేక బస్సుల్లో రూ.190, కరీంనగర్‌కు సూపర్ డీలక్స్ బస్సులో రూ.300 ఉండే టికెట్ ప్రస్తుతం రూ.400గా వసూలు చేస్తున్నట్లు ప్రయాణికులు తెలిపారు.
ముందస్తు సమాచారం లేకుండా ధరలు పెంచడంపై పలువురు ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పండుగ వేళ స్వగ్రామాలకు వెళ్లాల్సిన సామాన్యులకు అదనపు ఛార్జీలు భారంగా మారాయని వారు వాపోతున్నారు.
అయితే, పండుగ సమయాల్లో ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీల కంటే 1.5 రెట్లు వరకు అధికంగా వసూలు చేసే వెసులుబాటు 1981 ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం సంస్థకు ఉందని టీజీఎస్‌ఆర్టీసీ పీఆర్‌వో ప్రసన్న వివరణ ఇచ్చారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులు ఏర్పాటు చేసి, సురక్షిత ప్రయాణ సౌకర్యం కల్పించడమే సంస్థ లక్ష్యమని పేర్కొన్నారు.