భారత్‌లో అమెరికా పెట్టుబడుల విలువ మరింత పెరిగింది. 2025 చివరి నాటికి భారత సెక్యూరిటీల్లో అమెరికా పెట్టుబడుల విలువ 390 బిలియన్ డాలర్లకు చేరింది. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.33 లక్షల కోట్లకు సమానం.
అమెరికా ట్రెజరీ విభాగం తాజాగా విడుదల చేసిన ప్రాథమిక గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది.
2024 చివరి నాటికి భారత్‌లో అమెరికా పెట్టుబడుల విలువ 383 బిలియన్ డాలర్లుగా ఉండగా.. ఏడాదిలో మరో 7 బిలియన్ డాలర్లు పెరిగింది. అంటే సుమారు 1.8 శాతం వృద్ధి నమోదైంది.
అమెరికా పెట్టుబడుల్లో అత్యధిక భాగం భారత స్టాక్ మార్కెట్‌లోనే ఉంది. 2025 చివరి నాటికి భారత ఈక్విటీల్లో అమెరికా పెట్టుబడుల విలువ 380 బిలియన్ డాలర్లకు చేరింది. 2024లో ఈ విలువ 373 బిలియన్ డాలర్లుగా ఉంది.
ఇక భారత దీర్ఘకాలిక రుణ పత్రాల్లో అమెరికా పెట్టుబడులు 11 బిలియన్ డాలర్లకు చేరాయి. అంతకుముందు ఏడాది ఇవి 10 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. స్వల్పకాలిక రుణ పత్రాల్లో అమెరికా పెట్టుబడులు 500 మిలియన్ డాలర్ల కంటే తక్కువగా ఉన్నాయి.
అయితే ఈ గణాంకాలు అమెరికా పెట్టుబడిదారుల వద్ద ఉన్న భారత సెక్యూరిటీల మార్కెట్ విలువను మాత్రమే సూచిస్తాయి. కర్మాగారాలు, మౌలిక వసతులు వంటి భౌతిక ఆస్తుల్లో చేసిన ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు ఇందులో భాగం కావు.
ఇక అమెరికా పెట్టుబడులను ఆకర్షించడంలో భారత్ 12వ స్థానంలో నిలిచింది. గత ఏడాది కూడా ఇదే ర్యాంక్‌లో ఉంది.
ముఖ్యంగా చైనాను భారత్ వెనక్కి నెట్టింది. 2025 చివరి నాటికి భారత్‌లో అమెరికా పెట్టుబడులు 390 బిలియన్ డాలర్లు కాగా.. చైనాలో 318 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అంటే చైనాతో పోలిస్తే భారత్‌లో అమెరికా పెట్టుబడులు 72 బిలియన్ డాలర్లు అధికంగా ఉన్నాయి.
దక్షిణ కొరియాలోని 384 బిలియన్ డాలర్ల అమెరికా పెట్టుబడులతో పోల్చినా.. భారత్ స్వల్పంగా ముందుంది.
ప్రపంచవ్యాప్తంగా అమెరికా పెట్టుబడుల విలువ కూడా భారీగా పెరిగింది. 2025 చివరి నాటికి అమెరికా విదేశీ పెట్టుబడుల విలువ 19.3 ట్రిలియన్ డాలర్లకు చేరింది. 2024లో ఇది 15.8 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. ఇందులో 15.25 ట్రిలియన్ డాలర్లు విదేశీ ఈక్విటీల్లోనే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.