విశాఖపట్నం:
విశాఖపట్నం జిల్లా మధురవాడలోని చంద్రంపాలెం జాతరగట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఏడో రోజు శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారు శ్రీ మహాలక్ష్మి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
ఉత్సవాల్లో భాగంగా ముందుగా అమ్మవారికి పంచామృతం, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, కుంభాభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని శ్రీ మహాలక్ష్మి దేవిగా సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు పట్నాల హరిప్రసాద్ శర్మ, పట్నాల మూర్తి శర్మల బృందం ఆధ్వర్యంలో కుంకుమార్చనలు, పసుపు కొమ్ముల పూజ, సూర్య నమస్కారాలు, హోమం, నీరాజనం, మంత్రపుష్పం తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. చంద్రంపాలెంకు చెందిన పిళ్లా కృష్ణమూర్తి పాత్రుడు, అనిత దంపతుల సహకారంతో క్షీరాన్నం ప్రసాదాన్ని అమ్మవారికి నివేదించి భక్తులకు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త పిళ్లా చంద్రశేఖర్, కమిటీ అధ్యక్షుడు పిళ్లా సూరిబాబు, ఉపాధ్యక్షుడు పిళ్లా పోతరాజు, జనరల్ సెక్రటరీ నాగోతి తాతారావు, సెక్రటరీ పోతిన పైడిరాజు, కోశాధికారి పిళ్లా శ్రీనివాసరావు, ఉప కోశాధికారి పిళ్లా వెంకటరమణ, జాయింట్ సెక్రటరీ పోతిన ఉమామహేశ్వరరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ పొట్నూరి హరికృష్ణ, మీడియా ఇన్చార్జి బోగవిల్లి రాము, సోషల్ మీడియా ఇన్చార్జి మరుపిల్లి ఆనంద్, కమిటీ సభ్యులు, చంద్రంపాలెం గ్రామ పెద్దలు, పలువురు ప్రముఖులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.