విజయనగరం జిల్లాలో స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా సమస్యాత్మక గ్రామాలను గుర్తించి వాటిపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ తెలిపారు.
శనివారం ఎస్పీ కొత్తవలస మండలంలో పర్యటించారు. ముందుగా మండల పరిషత్ కార్యాలయాన్ని సందర్శించి, కొనసాగుతున్న నామినేషన్ల పరిశీలన ప్రక్రియపై మండల ఎన్నికల అధికారి బి. రవికిరణ్, ఎంపీడీవో పి. రమణయ్యలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులతో మాట్లాడి పలు సూచనలు చేశారు.
అనంతరం కొత్తవలస పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ, జిల్లాలో ఇప్పటివరకు 20 వేల మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. నేరచరిత్ర ఉన్న కొందరు వ్యక్తులు అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేసినట్లు గుర్తించామని, వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభపెట్టడం, గ్రామాల్లో అల్లర్లు సృష్టించడం వంటి చర్యలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని ఎస్పీ హెచ్చరించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉందని తెలిపారు.