అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిగానే పోటీ చేయాలని టీడీపీ, జనసేన నిర్ణయించినట్లు జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. సీట్ల సర్దుబాటుపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో జనసేన నేతలు నిర్వహించిన సమావేశం ముగిసింది. చర్చలు సఫలమయ్యాయని ఆయన వెల్లడించారు.
కూటమి పార్టీల మధ్య ఎలాంటి విభేదాలు లేవని బొలిశెట్టి శ్రీనివాస్ స్పష్టం చేశారు. కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా సీట్ల సర్దుబాటు చేపట్టి ఎన్నికల్లో పోటీ చేస్తామని తెలిపారు.
ఏయే ప్రాంతాల్లో ఏ పార్టీకి బలం ఉందో పరిశీలించి, ఆయా స్థానాల్లో సంబంధిత పార్టీ పోటీ చేసేలా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ, జనసేనతో పాటు కూటమిలోని ఇతర పార్టీలకు ఎన్ని స్థానాలు కేటాయిస్తారనే అంశంపై మరో రెండు రోజుల్లో అధికారిక ప్రకటన చేస్తామని పేర్కొన్నారు.