విశాఖపట్నం: మధురవాడ చంద్రంపాలెం జాతరగట్టుపై ఉన్న శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఐదో రోజు ఘనంగా జరిగాయి. గురువారం (అక్టోబర్ 15) అమ్మవారు శ్రీ లలితా త్రిపురసుందరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకం, హోమం నిర్వహించారు.
ఉత్సవాల్లో భాగంగా ముందుగా అమ్మవారి విగ్రహానికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు, జలాభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని శ్రీ లలితా త్రిపురసుందరీ దేవిగా సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. కుంకుమార్చనలు, బిల్వదళాలతో పూజలు, సూర్య నమస్కారాలు, హోమం, నీరాజనం, మంత్రపుష్పం తదితర కార్యక్రమాలను ఆలయ అర్చకులు పట్నాల హరిప్రసాద్ శర్మ, పట్నాల మూర్తి శర్మల బృందం శాస్త్రోక్తంగా నిర్వహించింది.
అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. బెంగళూరుకు చెందిన దేవన్, శ్రీదేవి దంపతులు, సాయిప్రియకు చెందిన కె. సూర్య సుదాకర్, సామ్రాజ్యలక్ష్మి దంపతుల సహకారంతో అమ్మవారికి బూరి, పులిహోర ప్రసాదాలను నివేదించి భక్తులకు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త పిళ్లా చంద్రశేఖర్, కమిటీ అధ్యక్షుడు పిళ్లా సూరిబాబు, ఉపాధ్యక్షులు పిళ్లా పోతరాజు, పిళ్లా మోహన్ శివకృష్ణ, జనరల్ సెక్రటరీ నాగోతి తాతారావు, సెక్రటరీ పోతిన పైడిరాజు, కోశాధికారి పిళ్లా శ్రీనివాసరావు, ఉప కోశాధికారి పిళ్లా వెంకటరమణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ పొట్నూరి హరికృష్ణ, మీడియా ఇన్‌చార్జి బోగవిల్లి రాము, సోషల్ మీడియా ఇన్‌చార్జి మరుపిల్లి ఆనంద్‌తో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
చంద్రంపాలెం గ్రామ పెద్దలు, ముఖ్య సభ్యులు కూడా ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.